‘ఎంసీఏ’ USA పబ్లిక్ రివ్యూ | చుసిన వాళ్ళు చెప్పిన రివ్యూ | మరి ఇంత గోరం గా ఉందా మూవీ..

‘ఎంసీఏ’ USA పబ్లిక్ రివ్యూ | చుసిన వాళ్ళు చెప్పిన రివ్యూ | మరి ఇంత గోరం గా ఉందా మూవీ..
వరుస విజయాలతో దూసుకెళ్తున్న దిల్ రాజు, నాని, సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి). ఓ మై ఫ్రెండ్ చిత్రం ద్వారా డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన వేణు శ్రీరాం ఈ చిత్రానికి దర్శకుడు. వదిన, మరిది మధ్య బంధం, అనుబంధాల కథతో తాజాగా ఎంసీఏను రూపొందించాడు వేణు శ్రీరాం. ఈ కథకు అందమైన ప్రేమ కథను జోడించాడు. మధ్య తరగతి కుటుంబ కథకు దేవీ శ్రీ ప్రసాద్ ఫీల్ గుడ్ మ్యూజిక్‌ను జత చేశారు. ఇన్ని పాజిటివ్ అంశాలకు దిల్ రాజు నిర్మాణ విలువలు తోడయ్యాయి. ఇలాంటి సానుకూల అంశాలతో ఎంసీఏ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో బలమైన అంశాలతో వచ్చిన ఈ కుటుంబ కథా చిత్రం ఆడియెన్స్‌ను మెప్పించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

నాని (నాని) మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు. తల్లి చిన్నతనంలో చనిపోవడం వల్ల అన్నయ్య (రాజీవ్ కనకాల) అతనికి సర్వస్వం. అన్నయ్య జీవితంలో జ్యోతి (భూమిక చావ్లా) భార్యగా ప్రవేశించడంతో కొంత వారి మధ్య దూరం పెరుగుతుంది. వదిన కారణంగానే అన్నయ్య దూరమయ్యాడనే ఫీలింగ్‌లో ఉంటాడు నాని. ఇంతలో అన్నయ్య ఉద్యోగ శిక్షణ నిమిత్తం ఢిల్లీకి వెళ్లడం, రవాణాశాఖలో పనిచేసే జ్యోతికి వరంగల్ ట్రాన్స్‌ఫర్ కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నాని కూడా వదినతో అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. వరంగల్‌లోనే పల్లవి (సాయి పల్లవి)ని చూసి ప్రేమలో పడిపోతాడు. తొలిచూపులోనే పల్లవి పెళ్లీ చేసుకొందామని ప్రపోజ్ చేస్తుంది. ఇలా కథ సాగుతున్న తరుణం శివశక్తి ట్రావెల్స్ యజమాని శివకు జ్యోతికి మధ్య వైరం కలుగుతుంది. ఆక్రమంలో జ్యోతిని శివ చంపబోతుండగా నాని అడ్డుకొంటాడు. కానీ ఎలాగైన జ్యోతిని చంపుతానని శివ శపథం చేస్తాడు. శివతో వైరం పెరుగడానికి కారణం ఏమిటి? ఈ పరిస్థితుల్లో వదినను ఎలా రక్షించుకొన్నాడు? తొలిచూపులోనే సాయి పల్లవి పెళ్లి ప్రపోజ్ చేయడానికి వెనుక ఉన్న కారణం ఏమిటీ? ఏ ఉద్యోగం, పనిపాట లేకుండా తిరిగే నానికి పల్లవితో పెళ్లి కుదిరిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్ర కథ. ఓ మై ఫ్రెండ్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు వేణు శ్రీరాం మరో ఐదేళ్ల తర్వాత మధ్య తరగతి కుటుంబంలో ఉండే బంధాలు, అనుబంధాలలతో ఎంసీఏ కథను అల్లుకొన్నాడు. మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించించే నాని కథానాయకుడిగా ఎంపిక చేసుకొన్నాడు. వదిన, మరిది మధ్య రిలేషన్స్‌ను కథకు జోడించాడు. వదిన కోసం మరిది, మరిది కోసం వదిన పడే ఆరాటంతో కథను నడిపించాడు. తొలి భాగంలో కథను ఆసక్తిగా నడిపిన దర్శకుడు.. రెండో భాగంలోకి వచ్చే సరికి తడబడినట్టు కనిపిస్తాడు. నాని, భూమిక, సాయి పల్లవి లాంటి బలమైన పాత్రల మధ్య దర్శకుడు కొంత నలిగిపోయాడనే చెప్పవచ్చు. అన్ని పాత్రల్లో సమతూకం పాటించడానికి నానా కష్టాలు పడి రెండో భాగంలో గందరగోళానికి గురయ్యాడనిపిస్తుంది. ఇక శివ విలన్ పాత్ర మధ్యలో అతికించినట్టుగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఆ పాత్రకు విజయ్ లాంటి వ్యక్తి ఎంచుకోవడం కొంత మైనస్‌గానే ఉంటుంది. బలమైన విలన్ ఉంటే స్టోరీ ఫ్లేవర్ తగ్గుతుందనే భావనతో విలన్ పాత్రను అండర్ ప్లే చేశాడా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్‌గా సెకండాఫ్‌లో రొటీన్ సీన్లు, బలహీనమైన కథనంతో అందరిని సంతృప్తి పరిచే శుభం కార్డు వేయడానికి నానా కష్టాలే పడ్డాడానే ఫీలింగ్‌తో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. ఇక వేణు శ్రీరాం దర్శకత్వ ప్రతిభ గురించి తక్కువగా అంచనా వేయడానికి అవకాశమే ఉండదు. నాని, సాయి పల్లవి, భూమిక లాంటి నటుల నుంచి బ్యాలెన్స్‌గా నటనను రాబట్టుకొన్నారు. రెండో భాగంలో కథ గురించి కొంత మరింత జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఎంసీఏ బ్లాక్‌బస్టరే అయి ఉండేదేమో. ఇక మధ్య తరగతి కుటుంబాలు, వారి పాట్లను చక్కగా తెరపై వివరించాడు. నాని, సాయి పల్లవి, భూమిక, నరేష్, పోసాని చేత మంచి డైలాగ్స్ పలికించేలా జాగ్రత్త పడ్డాడు. ఓవరాల్‌గా దర్శకుడిగా ఫస్ట్ క్లాస్ మార్కులు సంపాదించుకొ తన వంతు ప్రయత్నమే చేశాడనిపిస్తుంది. ఇక నాని విషయానికి వస్తే మధ్య తరగతి యువకుడి పాత్రలు అతనికి కొట్టిన పిండే. అన్నయ్య అంటే చెప్పలేనంతగా ఇష్టపడే తమ్ముడిగా.. వదినపై ఈర్ష్య పడే మరిది.. అలాగే వదిన అంటే అమితంగా ఇష్టపడేవ వ్యక్తిగా, చాలా ఇష్టపడి ప్రేమించిన యువతిని రక్షించుకొనే ప్రియుడిగా, వదిన ప్రాణాలు తీయడానికి ప్రయత్నించే ఓ దుష్టుడిని ఎదుర్కొనే యువకుడిగా చాలా రకాల ఫ్లేవర్ ఉన్న పాత్రను సమర్ధవంతంగా పోషించి మెప్పించాడు.
ప్రతీ మధ్య తరగతి యువకుడి తనను చూసుకునే విధంగా ఆ పాత్రను మలిచేలా కృషి చేశాడు. నాని యాక్టింగ్ విషయానికి వస్తే ఆ పాత్రలో ఎలాంటి లోపాలు కనిపించవు. డ్యాన్సులు, ఫైట్లతో మెప్పించాడు. తెలుగులో సాయి పల్లవికి మరో మంచి పాత్ర లభించింది. పల్లవి పాత్రలో అల్లరి, చిలిపి పాత్రలో ఆకట్టుకొంటుంది. ఇక పాటల్లో డ్యాన్సులతో దుమ్ము దులిపేసింది. స్క్రీన్ మీద నానితో కలిసి ఉంటే ప్రేక్షకుడు సాయిపల్లవిని చూసేంతగా ఆకట్టుకొన్నది. గ్లామర్‌తో ఆలరించింది. కథ మొత్తం నాని, భూమిక మీద నడిచినా.. అవకాశం దొరికిన ప్రతీచోట ప్రేక్షకుడికి నటనతో, డ్యాన్స్‌తో మైమరిపిస్తుంది. యువకుడు, ఖుషీ, మిస్సమ్మ లాంటి చిత్రాల్లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకొన్న భూమిక చావ్లా కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరమైంది. ఈసారి ఎంసీఏ చిత్రంలో హీరోయిన్‌గా కాకుండా బలమైన క్యారెక్టర్‌ పాత్రలో మళ్లీ భూమిక తెర మీద మెరిసింది. రవాణాశాఖలో ఉన్నత ఉద్యోగి పాత్రలో భూమిక హుందాగా కనిపించింది. వదినగా నానితో పోటాపోటిగా నటించింది. తన పాత్రకు వందశాతం న్యాయం చేకూర్చింది. జ్యోతి పాత్రలో మళ్లీ తెలుగు తెరకు నిండైన నటి దొరికింది అని ఫీలింగ్‌ను కల్పించింది. నాని, సాయి పల్లవి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన చిత్రం ఎంసీఏ. మధ్య తరగతి కుటుంబ కథకు భూమిక అదనపు ఆకర్షణగా మార్చారు. నానికి మల్టీప్లెక్స్, ఏ సెంటర్లలో మంచి మార్కెట్ ఉంది. ఇక బీ, సీ కేంద్రాల్లోని ప్రేక్షకులు ఆదరిస్తే ఈ చిత్రం సినిమా యూనిట్‌కి చక్కటి విజయం సొంతమవ్వడం ఖాయం.

Comments